పాపాయి ఊసులు
మాటలురాని పాపాయి
ప్రొద్దున్నె మేలుకొలిపి
పలుకులను పెదవులకిచ్చి
పుటలపై పెట్టమంటుంది
నడకరాని పాపాయి
కళ్ళముందుకు వచ్చి
పదాలను పసందుగాకూర్చి
ప్రాసలతో నడిపించమంటుంది
అమాయకమైన పాపాయి
ఎత్తుకోమని కోరి
అయోమయంలేని అద్భుతకైతని
ఆవిష్కరించమని అడుగుతుంది
చిరునవ్వుల పాపాయి
చెంతకు వచ్చి
అందరి మోములని
వెలిగించమని వేడుకుంటుంది
అందమైన పాపాయి
అంతరంగంలో నిలిచి
చక్కని కయితని
చదువరులకు చేర్చమంటుంది
అల్లారుముద్దుల పాపాయి
ఆనందాలను అందించి
అమితంగా ఆకట్టుకొని
అక్షరాలతో అలరించమంటుంది
కల్లాకపటంతెలియని పాపాయి
ప్రేమానురాగాలు చూపించి
తేనెచుక్కలు చిందించి
అక్షరజల్లులు కురిపించమంటుంది
ఆలోచించలేని పాపాయి
మనసును దోచుకొని
తలనుతట్టి తలపులిచ్చి
తెల్లకాగితంపై తెలుపమంటుంది
పసి పాపాయిలు
పరమాత్ముని సృష్టి
అద్భుత కవితలు
కవిబ్రహ్మల సృష్టి
పాపాయిలను చూచి
పరవశించిపోండి
కవనాలను చదివి
కుతూహలపడండి
నచ్చితే
నందకం
మెచ్చితే
ముదావహం
పాపాయిలకి
దీవెనలు
పాఠకులకి
ధన్యవాదాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment