ఓ పిచ్చికవీ!


అదే పనిగా

అదే దిక్కున

అదే దృశ్యాన్ని

కళ్ళార్పకుండా చూడకు

దుమ్ముధూళి పడవచ్చు

బాధను కలిగించవచ్చు


అదే పనిగా

అదే ఉద్దేశ్యంతో

అదే అవకాశంగా

ఆదమరచి ప్రవర్తించకు

ఆటంకాలు కలగవచ్చు

అభాసుపాలు కావచ్చు


అదే పనిగా

అదే ధాటిగా

అదే వరసలో

అతిగా మాట్లాడకు

అల్పుడవు కావచ్చు

అపార్ధాలు కలగవచ్చు


అదే పనిగా

అదే రీతిన

అదే నీతిని

పాడిందే పాడకు

చెప్పిందే చెప్పకు

బోరుకొలప బోకు


అదే పనిగా

అదే ధ్యాసతో

అదే ఆశయంతో

ఆలోచనలు పారించకు

కాలం వృధాకావచ్చు

మెదడు వేడెక్కవచ్చు


అదే పనిగా

అదే శిల్పాన్ని

అదే శైలిలో

రచన సాగించకు

విసుగు కలగవచ్చు

విమర్శలు కురవవచ్చు


అదే పనిగా

అదే మూసలో

అదే అలవాటుగా

సొంతడబ్బా కొట్టుకోకు

ఎచ్చులకోరి అనుకోవచ్చు

వెర్రివాడవని తలచవచ్చు


అదే అక్షరాలను

అదే పదాలను

అదే బాషలో

విన్నూతనంగా వాడు

విచిత్రంగా చూపు

వైవిధ్యభరితం చెయ్యి


ఓ పిచ్చికవీ

ఓమారు ఆలోచించు

ఒకపరి పరికించు

కవనము సాగించు

కవితలు పారించు

కవిత్వము మెరిపించు


ఓ పిచ్చికవీ

మాయకు లొంగిపోకు

విసిగి వేసారకు

పదేపదే తడుముకోకు

తరచితరచి చూడకు

పునరుక్తము చేయకు 


ఓ పిచ్చికవీ

పిచ్చిని గమనించు

పిచ్చిని దరిచేరనీకు

పిచ్చిని పారద్రోలు

తెలివిని చూపించు

మదులు మురిపించు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog