ప్రేమలోకం పిలుస్తుంది


ప్రేమలోకం

పిలుస్తుంది

రండి

కదలిరండి


విత్తనం నాటితే

మొక్క మొలవాలి

ఆకులు తొడగాలి

పచ్చగ ఎదగాలి


ప్రేమ నాటుకుంటే

పరిచయాలు ఏర్పడాలి

ఆలోచనలు లేపాలి

ఆశలు మదిలోపుట్టాలి


మొక్క మొలిస్తే

చెట్టు ఎదగాలి

పూవులు పూయాలి

కాయలు కాయాలి


ప్రేమ పుట్టితే

మనసులు మురియాలి

హృదయాలు కలవాలి

ఆనందాలు వెల్లివిరియాలి


పైరు పండితే

పంటలు చేతికిరావాలి

సంపదలు చేకూర్చాలి

మోములు వెలిగిపోవాలి


ప్రేమ పండితే

హృదయాలు పొంగాలి

అనుబంధాలు పెరగాలి

జీవితాలు సఫలమవ్వాలి


గాలి వీస్తే

కొమ్మలు కదలాలి

మబ్బులు తేలాలి

వానలు కురియాలి


ప్రేమ వీస్తే

అనురాగాలు బలపడాలి

ఆనందాలు అందించాలి

సమాజం చైతన్యంపొందాలి


ప్రేమే

బంధము, మకరందము

అందము, ఆనందము

జీవితము, లోకము


ప్రేమలేని జీవితం

పిల్లలులేని కుటుంబం

ఉప్పులేని ఆహారం

జాబిలిలేని ఆకాశం


రండి కదలిరండి

ప్రేమలు పంచుకుందాం

చేతులు కలుపుకుందాం

అన్యోన్యంగా జీవిద్దాం

లోకక్షేమం కోరుకుందాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog