నా కవితలు
పువ్వులను
పరికించమంటాయి
తేటులను
తిలకించమంటాయి
అందాన్ని
ఆస్వాదించమంటాయి
ఆనందాన్ని
అనుభవించమంటాయి
ఆలోచనలను
అంతరంగానలేపుతాయి
భావుకతను
బహిరంగపరుస్తాయి
మదులను
మురిపిస్తాయి
హృదులను
అలరిస్తాయి
గుర్తుండి
పోతాయి
ఙ్ఞప్తికి
వస్తుంటాయి
తేటగా
ఉంటాయి
తీపిగా
ఉంటాయి
అలతిపదాలు
అలరిస్తాయి
ప్రీతిపదాలు
పరవశపరుస్తాయి
మహాప్రాణపదాలు
అతి అల్పము
కఠినమైనపదాలు
కడు స్వల్పం
అమృతాన్ని
చల్లుతాయి
వెన్నెలను
కురిపిస్తాయి
తలలు
తట్టుతాయి
మదులు
ముట్టుతాయి
వెలుగులు
చిమ్ముతాయి
సుగంధాలు
చల్లుతాయి
వేడుక
కలిగిస్తాయి
వేదన
తగ్గిస్తాయి
చదవమని
కోరతాయి
స్పందించమని
చెబుతాయి
శిల్పాన్ని
చూడమంటాయి
శైలిని
కాంచమంటాయి
కవనసారాన్ని
క్రోలమంటాయి
సాహితీస్పందనలను
తెలియజేయమంటాయి
నచ్చితే
నిత్యకవితలు అందిస్తా
మెచ్చితే
మంచికవితలు ముందుంచుతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment