చిరుగాలులు
చిరుగాలులు వీస్తుంటే
చిరుకొమ్మలు ఊగుతుంటే
కళ్ళుచూస్తాయి అందాలు
వళ్ళుపొందుతుంది ఆనందాలు
చిరుగాలులు సాగుతుంటే
చిరుమోములకు తగులుతుంటే
మురిసిపోతుంది నాహృదయం
వెలిగిపోతుంది నావదనం
చిరుగాలులు సందడిచేస్తుంటే
చిటపటచినుకులు పడుతుంటే
ఆలపిస్తుంది నా అంతరంగము
అమృతవర్షం వినిపిస్తుంది రాగము
చిరుగాలులు సంతసపరిస్తే
చిరుముత్యాలు రాలుతుంటే
పొంగిపోతుంది నా మనసు
పరవశపరుస్తుంది ఆ సొగసు
చిరుగాలులు సుగంధాలుచల్లుతుంటే
చిరునవ్వులు కలిగిస్తుంటే
ఉప్పొంగుతుంది నా మది
ఉవ్విళ్ళూరుతుంది నా హృది
చిరుగాలులు మబ్బులనెడుతుంటే
చిత్రమైనరూపాలు కనబడుతుంటే
ఆకర్షిస్తుంది ఆకాశం
ఆనందపరుస్తుంది ఆదృశ్యం
చిరుగాలులు వంటినితాకుతుంటే
చల్లనిస్పర్శ పులకిస్తుంటే
సంబరపడుతుంది నా శరీరం
చెలరేగిపోతుంది నా మానసం
చిరుగాలులకు స్వాగతం
చిరునవ్వులకు సుస్వాగతం
చిరుజల్లులకు ఆమంత్రణం
చల్లదనాలకు ఆహ్వానం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment