కవులకు స్వాగతం

(కవిహృదయం)


ఎందుకు ఈ సమ్మేళనాలు

ఎందుకు ఈ సమాగమాలు 

ఏల కవులనొకచోటచేర్చటాలు

ఏల కోకిలలనుకూయించటాలు


ఎందుకా

కవితలను కొనసాగించటానికి

భాషను బ్రతికించటానికి

సాహిత్యాన్ని వృధ్ధిచెయ్యటానికి 


కలంపట్టిన కవులకు

గళంవిప్పెడి కోయిలలకు

కైతలువ్రాసిన బ్రహ్మలకు

సాదరస్వాగతం పలుకుతా


అందాలను వర్ణించేవారికి

ఆనందాలను కలిగించేవారికి

మోములను వెలిగించేవారికి

హార్ధికసుస్వాగతం చెబుతా


ఊహలను ఊరించేవారికి

అక్షరాలను అల్లేవారికి

పదాలను పారించేవారికి

మనఃపూర్వక ఆహ్వానమందిస్తా


పొగడ్తలుగుప్పించేవారికి

ప్రోత్సహించేవారికి

పరవశపరిచేవారికి

ప్రియాత్మక ఆమంత్రణమంటా


ప్రశంసాపత్రాలు ఇచ్చేవారికి

బహుమతులు అందించేవారికి

శాలువాలు కప్పేవారికి

హృదయపూర్వక ధన్యవాదాలుతెలియజేస్తా


సభకువిచ్చేసిన అతిధులకు

వినటానికొచ్చిన ప్రేక్షకులకు

చూడటానికొచ్చిన వీక్షకులకు

ప్రేమపూర్వక కృతఙ్ఞతలుతెలుపుతా 


భావాలతో ఆకర్షించేవారికి

శ్రావ్యతతో వీనులవిందుచేసేవారికి

అంతరంగాలను ఆకట్టుకొనేవారికి

అభిమానాభిమంత్రణం వ్యక్తపరుస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog