నువ్వు
నీవు
ఎందుకు పుడతావు
ఎక్కడికి తీసుకెళ్తావు
ఏమి చేయిస్తావు
నీవు
తలలో దూరతావు
నీరులా పారుతావు
గాలిలా వ్యాపిస్తావు
నీవు
వేడిని పుట్టిస్తావు
బుర్రను గోకిస్తావు
ఆదేశాలు జారీచేస్తావు
నీవు
చక్కదనాలు చూపిస్తావు
సంతసాలు కలిగిస్తావు
సర్వము తెలుసుకోమంటావు
నీవు
వెలుగులు చిమ్ముతావు
చీకటిని పారద్రోలతావు
పగటికలలు కనమంటావు
నీవు
సౌరభాలు వెదజల్లుతావు
పరిసరాలు పరిశుభ్రంచేయిస్తావు
పీల్చువారిని పులకరింపజేస్తావు
నీవు
ప్రేమజల్లులు కురిపిస్తావు
ఆశలు ఎన్నోమదిలోలేపుతావు
పనిలోకి తక్షణందింపుతావు
నీవు
గాలిలో ఎగరమంటావు
ఆకాశంలోకి వెళ్ళమంటావు
మబ్బులపై స్వారీచేయమంటావు
నీవు
జాబిలిపైకెక్కి తిరగమంటావు
తారలతో సహవాసంచేయమంటావు
నవలోకాన్ని సృష్టించమంటావు
నీవు
మెరుపులా వస్తావు
మరుక్షణం మాయమవుతావు
మెదడుపై ముద్రవేసివెళ్తావు
నీవు
కళ్ళకుపనిని అప్పగిస్తావు
చూపులను కేంద్రీకరించమంటావు
కనుగొన్నదాన్ని విశ్లేషించమంటావు
నీవు
నోటిని తెరవమంటావు
ప్రశ్నలు కుమ్మరిస్తావు
సమాధానాలు రాబడతావు
నీవు
కలమును పట్టమంటావు
కాగితమును తియ్యమంటావు
కరానికి పనిపెడతావు
నీవు
కవితలను కమ్మగాకూర్చమంటావు
పాఠకులను పరవశింపజేయమంటావు
సాహిత్యలోకంలో స్థిరంగానిలువమంటావు
ఓ ఊహా!
ఎందుకు ననుతడతావు?
ఏల నావంటికిపనిపెడతావు?
ఏకార్యాలు నాతోచేయించదలిచావు
నేను
సుదూరంగా పయనించి అలసిపోయున్నా
జీవిత చివర అంకంలోనున్నా
ఇక ముందుకు అడుగులేయకున్నా
నీవునన్ను
వదలరాదా
విరామమివ్వరాదా
వీడ్కోలుచెప్పరాదా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment