తరగని ప్రేమ

(ఆ ప్రేమ)


ఆ ప్రేమ

తరగనిది

తొలగనిది

స్థిరమైనది


ఆవిరై 

ఆకాశాన్ని చేరినా

మేఘమై

మేనుమీద చినుకులురాలుస్తుంది


సిగ్గై

బుగ్గలనెర్రపరచినా

మొగ్గై

పైటనుకప్పుకొనివస్తుంది


పువ్వై

వాడిపోయినా

నవ్వై

వదనాన్నివెలిగిస్తుంది


పయనమై

బహుదూరం పోయినా

చిరుగాలై

చల్లగా చుట్టుముడుతుంది


అదృశ్యమై

అగుపించకపోయినా

గంధమై

గుబాళిస్తుంది


క్షణాలై

కాలం గడచినా

ఙ్ఞాపకమై

వెంటపడుతుంది


మాయమై

మట్టిలోకివెళ్ళినా

జలై

చేదుకోమంటుంది


కలై

కవ్వించినా

కవితై

కాగితాలకెక్కుతుంది


ఊసై

ఉరుకులు తీసినా 

పలుకులై

పెదవులనుండి ప్రవహిస్తుంది


ఎక్కువై

ఎన్నోసంగతులు మరచిపోయినా

మనసై

మెదడులో కూర్చుంటుంది


చక్కదనమై

సుదూరాలకుపయనించినా

సంతసమై

చిత్తానిచేరుతుంది


భ్రమై

భ్రాంతిలోపడవేసినా

ప్రేమై

పరవశపరుస్తుంది


ఆ ప్రేమను

ఎలా మరచిపోను?

ఆ ఋణము

ఎలా తీర్చుకోను?


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog