అక్షరజల్లులు


అక్షరాలు

ఆవిరై ఆకాశాన్నిచేరాయి

అంబుధాలు

ఆకర్షించి ఘనీభవించాయి


అందాలు

అత్రేయుడునుండి పొందాయి

అమృతచుక్కలు

అకల్కనుండి స్వీకరించాయి


రంగులు

హరివిల్లునుండి తీసుకున్నాయి

కాంతులు

సూర్యుడినుండి వశపరుచుకున్నాయి


తళుకులు

తారలనుండి పుచ్చుకున్నాయి

మెరుగులు

మెరుపులనుండి అందుకున్నాయి


భ్రమణాలు

భూమినిండి నేర్చుకున్నాయి

పరిమళాలు

పూలనుండి సేకరించాయి


కొండాకోనలు

కనిపించి కుతూహలపరచాయి

సెలయేర్లు

సందడిచేసి సంతసపరిచాయి


తేనెలు

పూలనుండి తెచ్చుకున్నాయి

రెక్కలు

పక్షులనుండి ప్రాప్తించుకున్నాయి


చినుకులు

చిటపటా పడుతున్నాయి

గంగాజలాలు

గలగలా పారుతున్నాయి


మనసులు

సముద్రాలు అవుతున్నాయి

ఆలోచనలు

అలలై ఎగిసిపడుతున్నాయి


అక్షరచుక్కలు

నింగినుండి కురుస్తున్నాయి

అక్షరపంటలు

నేలమీద పండుతున్నాయి


అక్షరబొట్టులు

కలాలనుండి కారుతున్నాయి

అక్షరపంక్తులు

కాగితాలపై కూర్చుంటున్నాయి


కలాలు

కవితలను కూర్చుతున్నాయి

కాగితాలు

భావాలకు రూపమిస్తున్నాయి


అక్షరజల్లులు

అంతరాంగాలను అలరించుతున్నాయి

పరవశాలు

పాఠకులచెంతకు చేరుతున్నాయి


క్షరరహితాలు

కథలై చదివిస్తున్నాయి

కవితలై పాడిస్తున్నాయి

సాహిత్యమై చిరకాలంనిలుస్తున్నాయి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog