పదాలపసందులు
కాకులకావుకావులైనా
కవులకరాలచేరితే
కోకిలలకుహూకుహూలై
కమనీయతనందిస్తాయి
పరుషపదాలైనా
కైతలోవాడితే
సరళపదాలై
సంతసపరుస్తాయి
రిక్తపదాలైనా
కవనంలోభాగమైతే
శక్తిపదాలై
సంబరపరుస్తాయి
వ్యర్ధపదాలైనా
కవితస్వీకరిస్తే
అర్ధవంతమై
అలరించుతాయి
పెద్దపదాలైనా
కయితకరుణిస్తే
శుద్ధపదాలై
చోద్యపరుస్తాయి
నాటుపదాలైనా
చక్కగా అమరిస్తే
నవ్వపదాలై
నాలుకల్లోనానుతాయి
మోటుపదాలైనా
మంచిగామలిస్తే
తేటపదాలయి
తేనెచుక్కలుచిందుతాయి
పాతకాలపుపదాలైనా
పుటలకెక్కిస్తే
కొత్తదనమునుచూపించి
కుతుహలపరుస్తాయి
పల్లెపదాలైనా
పేజీలపైపరిస్తే
జానపదాలై
జనరంజకాలవుతాయి
రమ్యపదాలను
రసగీతాల్లోచేరిస్తే
కమ్మనిపదాలయి
కర్ణాలకువిందునిస్తాయి
అందాలపదాలను
అర్ధవంతంగావినియోగిస్తే
ఆనందపదాలయి
అందరినాకర్షిస్తాయి
పదాలను
పక్కాగాప్రయోగించితే
పాఠకులను
పూర్తిగాపులకరించుతాయి
పదప్రయోగాలు
పరవశపరుస్తాయి
పదబంధాలు
ప్రమోదపరుస్తాయి
పదాలు
అర్ధాలనుస్ఫురిస్తాయి
ప్రాసలు
పంక్తులకింపునిస్తాయి
పదములు
పదనిసలాడుతాయి
పలుకులు
పసందునుకలిగిస్తాయి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment