నేనొక ప్రేమపిపాసిని


పొడుస్తునపొద్దు రమ్మంటే

వెంటనే మేల్కొంటా

తలుపులు తెరుస్తా

అరుణకిరణాలను స్వాగతిస్తా


విరబూసినపూలచెట్టు పిలిస్తే

చూచి సంబరపడతా

వంగి ముద్దాడుతా

అభినందనలు చెబుతా


అందాలు అస్వాదించమంటే

పరిసరాలు పరికించుతా

ఆనందాలను అందుకుంటా

మేనును మురిపించుతా


ఆకాశం ఆహ్వానిస్తే

నీలిమబ్బులను కంటా

ఉరుములను వింటా

మెరుపులను చూస్తా


మేఘాలు మురిపిస్తే

కళ్ళను అప్పచెబుతా

మనసుకు పనిబెడతా

హృదిని ఆహ్లాదపరుస్తా


తారలు తొంగిచూడమంటే

తలనెత్తి తిలకిస్తా

తళుకులు స్వీకరిస్తా

తందనాలు త్రొక్కుతా


సముద్రం సైగచేస్తే

సంగమించే నదులచూస్తా

ఎగిసిపడే కెరటాలుచూస్తా

తీరంలో సంచరిస్తా


పున్నమి కనుగీటితే

పరుగెత్తుకుంటూ వెళ్తా

పరికించి ప్రేమనుపంచుతా

విహరించి వేడుకచేస్తా


ప్రేయసి ముందుకొస్తే

పువ్వులు చల్లుతా

నవ్వులు చిందుతా

ముచ్చట్లు చెబుతా


కవిత కవ్విస్తే

ఆలోచనలు పారిస్తా

కలమును చేపడతా

కైతను కూరుస్తా


ప్రేమకోసం

తపిస్తా

ప్రేమవెంట

పరుగెడుతా


ప్రేమరాజ్యం

స్థాపిస్తా

ప్రేమలోకంలో

విహరిస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog