లోకంతీరు


అన్నీ అవయాలుంటేనే

మనిషిగాచూస్తారు

మానవత్వం

ఉన్నా లేకపోయినా


మంచి బట్టలేసుకుంటేనే

మర్యాదనిస్తారు

మాటలుచేష్టలు

బాగున్నా లేకున్నా


చక్కని రూపముంటేనే

స్వాగతిస్తారు

అందమే

ఆనందమనుకొని


నవ్వులముఖాలనే

ఇష్టపడతారు

ప్రతిస్పందించి

పరవశముపొంది


అధికారమున్నవారికే

అధికప్రాధాన్యమిస్తారు

దగ్గరవటానికి

తహతహలాడుతూ


పలుకులు తియ్యగాయుంటేనే

శ్రద్ధగావింటారు

ఆస్వాదించి

అక్కునచేర్చుకొని


నచ్చినవారినే

ఆకాశానికెత్తుతారు

నలుగురుతోకలసి

సన్మానసత్కారాలందించి


మేలుచేసేవారినే

మెచ్చుకుంటారు

మనసునందు

నిలుపుకొని


ఉచితంగాయిస్తామంటే

ఉరుకులుపరుగులుతీస్తారు

చిక్కినదంతా

పుచ్చుకుందామని


విజయంసాధిస్తే

విర్రవీగుతారు

ఓడినవారిని

అవహేళనచేస్తూ


లోకంతీరు

గమనించు

తగినట్లు

వ్యవహరించు


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog