తలుపుల్లేని ఇల్లు


నా ఇంటికి

తలుపులులేవు

అందరినీ

ఆహ్వానిస్తా


నా ఆలోచనలకు

హద్దులులేవు

అంశాలన్నిటినీ

అవలోకిస్తా


నా చేతులకు

సంకెళ్ళులేవు

అనుకున్నవన్నీ

చేసేస్తా


నా కాళ్ళకు

బందాలులేవు

కోరినచోటుకు

పోతుంటా


నా మాటలకు

ఆంక్షలులేవు

తట్టినవన్నీ

చెబుతా


నా కళ్ళకు

కట్టులులేవు

అందాలన్నిటినీ

చూపిస్తుంటా


నా మనసుకు

షరతులులేవు

మంచివాటినన్నీ

పంచిపెడతా


నా కవితలకు

పరిమితులులేవు

విషయాలన్నీ

వ్యక్తపరుస్తా


నేను స్వేచ్ఛాజీవిని

నిబంధనలకులొంగను

నేను కవిని

నిరంకుశడను


నా కవితలు

వాస్తవరూపాలు

నా లోకము

సాహిత్యలోకము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog