కవనరహస్యాలు


అందాలు

నన్ను వెతుక్కుంటువస్తున్నాయో

అందాలను

నేను వెతికిపట్టుకుంటున్నానో

అర్ధంకావటంలా


పువ్వులు

నను చేరుతున్నాయో

పూలకడకు

నేను వెళ్ళుచున్నానో

అంతుబట్టటంలా


చెలి

నాహృదయం దోచుకుందో

చెలిని

నేను వశపరచుకున్నానో

ఆలోచనకుచిక్కటంలా


కవిత

నను కవ్వించివ్రాయిస్తుందో

కవితలను

నేను కోరికూర్చుతున్నానో

తెలియటంలా


కవనాలు

నేను చెవులారావినిపించినా

వ్రాతలు

పాఠకులు నోరారాపఠించినా

వ్యత్యాసమున్నట్లా


వాణీదేవి

నను ఆదేశిస్తుందో

వీణాధారిని

నేను ఆహ్వానిస్తున్నానో

తేలటంలా


ఏది ఏమైనా

సాహితీవనం

వర్ధిల్లుతుందికదా

పాఠకలోకం

పరిఢవిల్లుతుందికదా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog