తల్లీ సరస్వతీ!


ఊహలుపారించి

ఉత్సాహముకలిగించి

ఉల్లమునుపొంగించి

ఉవ్వెత్తునలేపించి

కవనలోకమందు

కాంతులు చిమ్మించుటకు

నీవే కారణము తల్లీ

నీదే ప్రేరణము తల్లీ!


కలములుపట్టించి

కాగితాలనందించి

కవితలువ్రాయించి

కవులనుసృష్టించి

సాహిత్యప్రపంచమందు

శాశ్వతస్థానమిప్పించుటకు

నీవే ప్రధానము తల్లీ

నీదే ప్రావీణ్యము తల్లీ!


చదివించి

పాడించి

మదులతట్టి

ఆనందపరచి

సాహితీజగత్తునందు

చిరంజీవినికావించుటకు

నీవే స్ఫూర్తి తల్లీ

నీదే కీర్తి తల్లీ!


అక్షరాలనేరి

పదాలపేర్చి

పంక్తులపొదిగి

కైతలనుకూర్చి

కవితాజగమునందు

కలకాలమునిలుపుటకు

నీవే మూలము తల్లీ

నీదే మూల్యము తల్లీ!


సమ్మేళనాలునిర్వహించి

శాలువాలుకప్పించి

బిరుదులుప్రదానముచేసి

పేరుప్రఖ్యాతులునిచ్చి

సారస్వతవిశ్వమందు

తారకల్లా వెలుగుటకు

నీవే అస్త్రము తల్లీ

నీదే శస్త్రము తల్లీ!


గీతాలనురాయించి

గళములనెత్తించి

గాంధర్వులచేపాడించి

గానామృతమునుపంచి

సంగీతజగత్తునందు

వీణానాదములువినిపించుటకు

నీవే యుక్తి తల్లీ

నీదే శక్తి తల్లీ!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

9177915285


Comments

Popular posts from this blog