వదలింపులు


చిన్నప్పటినుండి

వదులుకుంటూనే ఉన్నా

ఏదో ఒకటి

ఎప్పుడో ఒకప్పుడు


పేరు

వదులుకున్నా

అసలుపేరు అంకయ్య

నేటిపేరు రాజేంద్రప్రసాదు


ఊరు

వదులుకుకున్నా

పుట్టినఊరు చీర్వానుప్పలపాడు

నేడునివసిస్తున్నఊరు హైదరాబాదు


పొలాలు

వదులుకున్నా

తక్కువధరలకు అమ్ముకున్నా

అన్నదమ్ములతో పంచుకున్నా


ఆస్తులు

వదులుకున్నా

సంతానానికి ఇచ్చా

సతికి వ్రాసిచ్చా


వ్యవసాయం

వదులుకున్నా

ఓపిక నశించింది

శ్రద్ధ తగ్గిపోయింది


వృత్తి

మార్చుకున్నా

చేసినవృత్తి బ్యాంకు ఉద్యోగము

చేస్తున్నవృత్తి రచనా వ్యాసాంగము


పిల్లలను

వదులుకున్నా

ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు

భార్యమాత్రమే నిలిచిందితోడు


స్నేహితులను

వదులుకున్నా

ఉన్నారోలేదో తెలియదు

ఎక్కడున్నారో పత్తాలేదు


బాంధవ్యాలు

వదులుకున్నా

అక్కాచెల్లెల్లు అలకపూనారు

అన్నాతమ్ములు అవసరంలేదనుకున్నారు


అభిమానులను

వదులుకుంటున్నా

పొగడ్తలు వద్దంటున్నా

పలకరింపులు వలదంటున్నా


ప్రాణాలను

వదలబోతున్నా

దేవుడిపిలుపుకై ఎదురుచూస్తున్నా

క్రిష్ణారామాయంటూ కాలంగడుపుతున్నా


విప్పాను

వదలింపుల చిట్టా

తెలిపాను

త్యజింపుల లెక్క


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog