ఓ మనసా!
నువ్వు
ఆడిందల్లా
ఆటంటే ఎలా!
పాడిందల్లా
పాటంటే ఎలా!
కోరిందల్లా
కావాలంటే ఎలా!
పట్టిందల్లా
పసిడికావాలంటే ఎలా!
చెప్పిందల్లా
వినాలంటే ఎలా!
చూచిందల్లా
కొనాలంటే ఎలా!
నడవకుండా
గమ్యంచేరాలంటే ఎలా!
ఒళ్ళువంచకుండా
సంపాదించాలంటే ఎలా!
ప్రతిరాత్రి
పౌర్ణమికావాలంటే ఎలా!
ప్రతిప్రయత్నం
ఫలించాలంటే ఎలా!
తెల్లనివన్నీ
పాలనుకుంటే ఎలా!
నల్లనివన్నీ
నీళ్ళనుకుంటే ఎలా!
రాసిందల్లా
కవిత్వమంటే ఎలా!
కూసిందల్లా
కోకిలస్వరమంటే ఎలా!
ఆకాశానికి
నిచ్చెనవెయ్యాలంటే ఎలా!
మేఘాలపై
స్వారీచేయాలంటే ఎలా!
భ్రమల్లో
తేలాలంటే ఎలా!
కలలతో
కాలంగడపాలంటే ఎలా!
లేచిందేతడవుగా
పరుగులుతియ్యాలంటే ఎలా!
తట్టిందేతడవుగా
అమలుచెయ్యాలంటే ఎలా!
ఓ మనసా!
సావధానంగా ఆలోచించు
సమయానుకూలంగా సంప్రదించు
సక్రమంగా ముందుకునడిపించు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment