నా ముద్దుగుమ్మ
ఆమె కళ్ళల్లో
కాపురముంటా
కన్నీరును
కార్చనీయకుంటా
ఆమె నుదుటపై
బొట్టులాగుంటా
తారకలా
తళతళలాడిస్తుంటా
ఆమె బుగ్గలపై
నవ్వునవుతా
జాబిలిలా
వెన్నెలనుచల్లుతుంటా
ఆమె కేశములపై
గాలినవుతా
ముంగురలను
రెపరెపలాడిస్తుంటా
ఆమె కొప్పులో
పువ్వునవుతా
పరిమళాలను
వెదజల్లుతుంటా
ఆమె అధరాలపై
తేనెచుక్కలనవుతా
మాధుర్యాన్ని
ఆస్వాదింపజేస్తా
ఆమె తనువుపై
బంగరుపూతనవుతా
వన్నెచిన్నెలనై
వెలిగిపోతుంటా
ఆమె చూపుల్లో
ప్రేమలానిలుస్తా
విడిచి
వెళ్ళనీయకుంటా
ఆమెయే
నేననుకుంటా
ఆమెనే
సర్వమనుకుంటా
ఆమెకోసమే
తపిస్తా
ఆమెకోసమే
జీవిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment