(అక్షర)గారడీలు
ఆమె
కళ్ళు లాగేస్తున్నాయి
చూపులు పట్టేస్తున్నాయి
మాటలు కట్టేస్తున్నాయి
నవ్వులు ఆటపట్టిస్తున్నాయి
పువ్వులు
పొంకాలు చూపుతున్నాయి
పరిమళాలు చల్లుతున్నాయి
పరికించమంటున్నాయి
పులకరించమంటున్నాయి
పసిపాపలు
ఆటలు ఆడుతున్నారు
పాటలు పాడుతున్నారు
ముద్దులొలుకుతున్నారు
మయినిమరిపిస్తున్నారు
ఆకాశం
వెన్నెల చల్లుతుంది
మబ్బులు చూపుతుంది
చినుకులు కురిపిస్తుంది
మదులను దోసేస్తుంది
ఊహలు
గాలిలా వ్యాపిస్తున్నాయి
నీరులా ప్రవహిస్తున్నాయి
కాంతిలా వెలిగిపోతున్నాయి
అగ్గిలా రాజుకుంటున్నాయి
రాత్రి
కలలు వస్తున్నాయి
కవ్వించి పోతున్నాయి
కోర్కెలు లేపుతున్నాయి
కవనానికి కదలమంటున్నాయి
కవిత
కలము పట్టమంటుంది
కాగితము తీసుకోమంటుంది
క్షరరహితాలను పేర్చమంటుంది
కమ్మదనాలను పంచమంటుంది
మాటలు
మీటుతున్నాయి
మదినితడుతున్నాయి
మరిపిస్తున్నాయి
మురిపిస్తున్నాయి
కవితలు
కూర్చమంటున్నాయి
కులాసపరచమంటున్నాయి
గారడీలుచెయ్యమంటున్నాయి
గమ్మత్తులుచూపమంటున్నాయి
గారడీలు
మాయచేస్తున్నాయి
ముగ్ధులనుచేస్తున్నాయి
నమ్మిస్తున్నాయి
నాటకాలాడిస్తున్నాయి
గారడీలు
బురిడీలు కొట్టిస్తున్నాయి
ఇంద్రజాలాలు
విస్మయము కలిగిస్తున్నాయి
కైతలు
భ్రమలు కొలుపుతున్నాయి
కవులు
మాయలు చేస్తున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment