అదే పిచ్చి.. అదే యావ..


మత్తులో పడ్డా

తేరుకోలేకున్నా


అక్షరాలకు చిక్కా

అంకితమైపోయా


పదాలకు దొరికా

బానిసనైపోయా


ఊహలకు తావయ్యా

భ్రమలకు లొంగిపోయా


కలముకు బందీనయ్యా

గీతలు గీసేస్తున్నా


కాగితాలు ఖైదీనిచేశాయి

పంక్తులు పేర్పించుతున్నాయి


విషయాలు తడుతున్నాయి

విన్నూతనంగా విరచించమంటున్నాయి


కవిత కవ్విస్తుంది

రాయకపోతే ఊరుకోనంటుంది


కైతలు పుట్టకొస్తున్నాయి

పాఠకులకు పంపమంటున్నాయి


పిచ్చి ముదిరినట్లుంది

పుస్తకాలు ప్రచురించమంటుంది


మైకం నుండి

బయటకు రాలేకున్నా


చిత్తయి పోతున్నా

చెమటలు క్రక్కుతున్నా


చిత్తాలు దోస్తున్నా

చిరంజీవిని కావాలనుకుంటున్నా


మదిని చక్కబరచమని

వాణీదేవిని వేడుకుంటున్నా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog