రంగులాటలు
ఆకాశం
ఏడురంగులు పూసుకుంటుంది
చూపరులను చిందులేయిస్తుంది
రమణీమణులు
రంగులవస్త్రాలు ధరిస్తున్నారు
మగవారిని ఆటాడిస్తున్నారు
పువ్వులు
రకరకాలరంగులు అద్దుకుంటున్నాయి
పొంకాలుచూపి ఆటాపాటలలోదింపుతున్నాయి
చలికాలంపోయిందని
రంగునీళ్ళు చల్లుకుంటున్నారు
హోళీకేళి ఆడుతున్నారు
సీతాకోకచిలుకలు
రంగురెక్కలను రెపరెపలాడిస్తున్నాయి
పట్టుకోవాలనుకునేవారిని నానాతిప్పలుపెడుతున్నాయి
తూనీగలు రెక్కలూపుతు
రమ్యమైనరంగులేసుకొని ఎగురుతున్నాయి
చూపరులను గంతులేపిస్తున్నాయి
కుంచెలుపట్టి చిత్రకారులు
ఇంపైనరంగులతో సొంపైనచిత్రాలుగీస్తున్నారు
కళాప్రియులను కదంత్రొక్కిస్తున్నారు
అందమైన ప్రకృతి
వింతవింతరంగుల్లో వెలిగిపోతుంది
సౌందర్యప్రేమికులను సయ్యాటలాడిస్తుంది
ఆశలగుర్రమెక్కినజనులు
రంగులకలలు కంటున్నారు
భ్రమలలో తేలిపోతున్నారు
రంగులే
రంజకాలు
రమణీయాలు
రసగుల్లాలు
రంగులలోకంలో
విహరిద్దాం
రంగులమధ్యలో
నివసిద్దాం
జీవితమే
రంగులాట
రంగులబాట
రంగులతోట
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment