గాలికబుర్లు


గాలి వచ్చింది

గాత్రము తాకింది

గుసగుస లాడింది

గుబులును లేపింది


ఆకులను ఊపింది

గలగల ఆడించింది

పువ్వుల కదిలించింది

పరిమళాలు వెదజల్లింది


బూరలను నింపింది

బుజ్జాయిలను ఆడించింది

పతంగులను ఎగిరించింది

గగనాన రెపరెపాలాడించింది


పక్షులను పిలిచింది

పరవశా పరిచింది

ఆరేసినబట్టలను ముట్టింది

తడిని తరిమిపారేసింది


మబ్బులను తేల్చింది

మనసులను దోచింది

వానను తెచ్చింది

వాగులు పారించింది


నోటినుండి వెలువడింది

మాటలను వినిపించింది

ముక్కులో దూరింది

గుండెను ఆడించింది


చిరుగాలి తగిలింది

చిరునవ్వులు ఇచ్చింది

చల్లగాలి తాకింది

సంతసాన్ని ఇచ్చింది


ధూళిని లేపింది

దుమారం సృష్టించింది

మరలా వస్తానంది

మాయమై పోయింది


గాలికి కులములేదుమతములేదు

చిన్నాపెద్దా తేడాలేదు

ఆడామగా వ్యత్యాసములేదు

ధనికాబీదా భేదములేదు


గాలిలేని చోటులేదు

అవసరంలేని ప్రాణీలేదు

అయితే వాటమున్నది

తరిమే వేగమున్నది


గాలిదేవునికి ప్రణామము

గాలికవితకి విరామము

గాలిజోరుకు కళ్ళెము

గాలికబుర్లకి సమాప్తము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం


Comments

Popular posts from this blog