లోకంతీరు


లోకానకొంతమంది

కరుణాత్ములు ఉన్నారు

మరికొంతమంది

కఠినాత్ములు ఉన్నారు


కొంతమంది

తేనెచుక్కలు చల్లుతారు

మరికొంతమంది

నిప్పురవ్వలు రువ్వుతారు


కొంతమంది

పూలు చల్లుతారు

మరికొంతమంది

రాళ్ళు విసురుతారు


కొంతమంది

కోకిలకంఠము వినిపిస్తారు

మరికొంతమంది

కాకులగోలను తలపిస్తారు 


కొంతమంది

వెన్నెలను ఆస్వాదిస్తారు

మరికొంతమంది

చీకటిని కోరుకుంటారు


కొంతమంది

కోర్కెలను త్రుంచుకుంటారు

మరికొంతమంది

ఆశలను పెంచుకుంటారు


కొంతమంది

మంచిని చూస్తారు

మరికొంతమంది

తప్పులు వెదుకుతారు


కొంతమంది

కలిసి ఉండాలనుకుంటారు

మరికొంతమంది

విడిచి వెళ్ళాలనుకుంటారు


కొంతమంది

దివ్వెలు వెలిగిస్తారు

మరికొంతమంది

దీపాలు ఆర్పుతారు


కొంతమంది

లక్ష్మిదేవివచ్చినా తలుపుతీయరు

మరికొంతమంది

దరిద్రదేవతను ఆహ్వానిస్తారు


కొంతమంది

దేవతల్లాగా కనబడతారు

మరికొంతమంది

రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు


ముళ్ళదారిని 

వదలమంటా

పూలబాటను

పట్టమంటా


మనుషులను

వడబోయమంటా

మానవత్వమును

పోషించమంటా


అందరిమేలును

భువిన కోరమంటా

లోకసమస్తమును

దివిని చేయమంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog