ముఖేముఖే.........


మనిషిమనిషికి

ఒక పేరుంది ఒక ఊరుంది

ఒక కథవుంది ఒక రూపముంది

ఒక వ్యక్తిత్వమున్నది ఒక శైలియున్నది


మనసుమనసుకు

భావాలున్నాయి

భ్రములున్నాయి

భవితపై ఆశలున్నాయి


పుఱ్ఱెపుఱ్ఱెకు

బుధ్ధియున్నది

గమ్యమున్నది

మార్గమున్నది


మోముమోముకు

ఆకర్షణయున్నది

అందమున్నది

ఆనందమున్నది


ఇంటింటికి

యజమానియున్నాడు

ఇల్లాలుయున్నది

పిల్లలున్నారు


తల్లితల్లికి

ప్రేమయున్నది

దయయున్నది

మంచియున్నది


కుటుంబకుటుంబానికి

ఒక విలువున్నది

ఒకకట్టుబాటుయున్నది

ఒక గుర్తింపుయున్నది


ఊరూరికి

ఒక నామధేయమున్నది

ఒక చరిత్రయున్నది

ఒక ప్రత్యేకతయున్నది


దేశదేశానికి

సరిహద్దులున్నాయి

సంప్రదాయాలున్నాయి

సంస్కృతులున్నాయి


చెట్టుచెట్టుకు

ఆకులూకొమ్మలున్నాయి

పూలూకాయలున్నాయి

పచ్చదనముపరిశుభ్రతలున్నాయి


నవ్వునవ్వుకు

కళవున్నది

కారణమున్నది

కమ్మదనమున్నది


పువ్వుపువ్వుకు

పొంకమున్నది

ప్రత్యేకరంగున్నది

పరిమళమున్నది


మాటమాటకు

అర్ధమున్నది

వాడుకున్నది

ప్రాముఖ్యమున్నది


ముఖేముఖే సరస్వతి

విచిత్రం

విభిన్నం

విశిష్టం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog