కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ప్రారంభం
నేడు ఉదయం 10 గంటలకు హైదరాబాదు ఏ ఎస్ రావునగర్ రుక్మిణీపురి కాలనీలో కవి మరియు సినీ గేయ రచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రఖ్యాత కవి శ్రీ నూతక్కి రాఘవేంద్రరావు గారి చేతుల మీదగా కాప్రా మల్కాజగిరి కవుల వేదిక ప్రారంభించబడినది. శ్రీ రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ ఈ వేదిక దినదినాభివృద్ధి చెందాలని కవులకు ప్రోత్సహమివ్వాలని మరియు యువకవులను వెలుగులోకి తేగలరని ఆశాభావం వ్యక్తపరిచారు. సభాధ్యక్షులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు మాట్లాడుతూ నేడు 25 మంది కవులతో ప్రారంభమయిన ఈ వేదిక భవిష్యత్తులో వందల కవులతో వర్ధిల్లుతుందని నమ్మకం వెలిబుచ్చారు. గౌరవ అతిధి, ప్రఖ్యాత పద్యకవి.విశ్రాంత బ్యాంకు అధికారి శ్రీ రాధశ్రీ గారు ఈ వేదిక అభివృద్ధిచెందాలని తన ఆశు కందపద్యాలతో అందరినీ అలరించారు. అక్షర కౌముది వ్యవస్థాపకులు శ్రీ తులసి వెంకట రమణాచార్యులు గారు సమన్వయ కర్తగా వ్యవహరించి అతిధులను చక్కగా పరిచయంచేసి తన వాక్చాతుర్యాన్ని చాటుకున్నారు. పిమ్మట కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ గారు చక్కగా కవిసమ్మేళనం నిర్వహించారు. 25 మంది కవులు పాల్గొని తమ కవితలను చదివి వినిపించారు. నంది అవార్డు గ్రహీత మరియు సినీ నిర్మాత శ్రీ దీపక్ న్యాతి గారు త్వరగా స్పందించి సహకరించినందుకు కవులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కవులవేదిక నిర్వాహకుడు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు వేదిక స్థాపనలోను మరియు సమావేశ నిర్వహణలోను సహకరించిన సభ్యులందరికి ధన్యవాదాలు తెలియజేశారు. వచ్చేనెలనుండి కవుల సభలను పెద్ద ఎత్తున జరుపుతామని, దీనికి అందరూ కొత్త కవులను సమూహంలో చేర్చి సముహం అభివృద్ధికి అందరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. తదుపరి అందరి కవులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అందరూ నిర్వాహకుడు శ్రీ రాజేంద్రప్రసాద్ గారిని సమావేశం చక్కగా నిర్వహించినందుకు అభినందించారు. శ్రీ రమణాచార్యులు గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.
Comments
Post a Comment