డాక్టర్ ఎ యస్ రావుకు 21వ వర్ధంతి సందర్భముగా ఘన నివాళులు
31-10-24వ తేదీ ఉదయం ఎ యస్ రావునగర్ లో డాక్టర్ ఎ యస్ రావునగర్ నివాసుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఎ యస్ రావు గారి 21వ వర్ధంతి సందర్భంగా అతిధులు, ఐదుగురు కవులు మరియు వక్కృత్వపు పోటీలో గెలుపొందిన నలుగురు అణు విద్యుత్ పాఠశాల విద్యార్ధులు ఘన నివాళులు అర్పించారు. మొదట సంఘ నిర్వాహకుడు శ్రీ శంకరరావు గారు అతిధులను వేదికపైకి ఆహ్వానించారు.సభాధ్యక్షుడు శ్రీ బులుసు భాస్కరరావు గారు సంస్థ మరియు సంస్థ ఉద్యోగులు ఎ యస్ రావు గారికి ఎంతో ఋణపడి ఉన్నారన్నారు. ముఖ్య అతిధి శ్రీ వి కె ప్రేమచంద్ గారు శ్రీ రావు గారితో వారికున్న అనుబంధాన్ని 1930 వ దశకం నుండి 2000 వ దశకం వరకు సోదాహరంగా వివరించారు. శ్రీ రావు గారి ఆశయాలను భావాలను మహోన్నత వ్యక్తిత్వాన్ని తెలియపరిచారు.
కాప్రా మల్కాజగిరి కవుల వేదిక తరఫున ఐదుగురు కవులు పాల్గొని శ్రీ రావు గారికి గేయార్చనచేశారు. డాక్టర్ రాధా కుసుమ గారు జోహారు జోహారు ఎ యస్ రావు గారు, ఓ కార్యసాధకుడా అంటు చక్కగా పాడారు. పిమ్మట డాక్టర్ దీపక్ న్యాతి గారు అదిగో అదిగో అదిగదిగో నింగిని వెలుగుతుంది ఓ చుక్కా మనవైపే చూస్తుంది ఏ చక్కా అని పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కవయిత్రి శ్రీమతి దీకొండ చంద్రకళ వందనం వందనం అభివందనం అంటూ చక్కని స్వరంతో అద్భుతంగా పాడారు. కవయిత్రి శ్రీమతి ధనమ్మ రెడ్డి పుడితే నీలా పుట్టాలి ఓ సారు, జీవిస్తే నీలా బతకాలి ఓ ఎ యస్ రావు సారు అంటు పాటను వినిపించారు. కవుల వేదిక నిర్వాహకుడు శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ మహనీయుడు, నిరాడంబరుడు, తెలివైనవాదు, మన తెలుగువాడు అంటూ గేయాన్ని ఆలపించి ఎ యస్ రావు గారికి హాజరయిన వారందరితో జోహారులు కొట్టించారు.
తర్వాత వక్తృత్వపు పోటీలో గెలుపొందిన నలుగురు విద్యార్ధులు చక్కగా మాట్లాడి తమ వాగ్ధాటితో అందరిని అలరించారు. అతిధులను, కవులను మరియు విధ్యార్ధులను మెమోంటోలు ఇచ్చి సత్కరించారు. శ్రీ టి శ్రీనివాస్ గారి వందన సమర్పణతో సమావేశం ముగిసింది.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment