మళ్ళీ చిగురిద్దాం!


మనసు వికలమైనా

మాటలు దొర్లకున్నా

మౌనము ఆవరించినా

మొక్కల్లా మళ్ళీచిగురిద్దాం కవులారా


పూలు రాలినా

ఆకులు ఎండినా

చెట్లు మళ్ళీచిగుర్లుతొడగవా

జన్మను సాఫల్యంచేసుకోవా


తెల్లవారినా

నిద్రలేచినా

పనుల్లోపడినా

తీయనిరాత్రికలలను తలుచుకోమా


పూదండవాడినా

తీసిపారేసినా

తలలోలేకున్నా

మల్లెలవాసన వెంటనేకురులనువీడునా


చెలిదూరమైనా

ప్రేమవిఫలమైనా

కలుసుకోవటం కుదరకపోయినా

మధురానుభూతులను చెరిపేసుకోగలమా


ప్రయాసపడుతున్నా

ప్రయోజనందొరకకున్నా

చెమటలుకారుతున్నా

విజయంపొందేవరకు ప్రయత్నాన్నిసాగిద్దాంధీరుల్లా


కవి దేహాంతమైనా

కవితలు మరణించునా

ఖ్యాతి చెదురునా

కవిని చిరంజీవినిచెయ్యవా


పలువురుపాఠకులు పొగిడినా

పెక్కు సన్మానాలు చేసినా

పురస్కారాలు లభించినా

పలుకులమ్మను నిత్యంపూజిద్దాంసేవకుడిలా


చెట్లను

ఆదర్శంగా తీసుకుందాం

కొట్టేసినా

మరలామరలా చిగురిద్దాం


కవితలు

కమ్మగావ్రాద్దాం

కవిగా

ఖ్యాతినిపొందుదాం


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం


Comments

Popular posts from this blog