కవిత్వం నా ప్రయత్నం


నేను గాలిలో ఎగరాలని

మిమ్మలనూ నాతో తీసుకెళ్ళాలని

మబ్బులపై కూర్చోపెట్టాలని

జాబిలిపై విహరింపజేయాలని నా ప్రయత్నం


నా నోటిలోని

మాటలను

మీ నోటిలోపెట్టి

పలికించాలని నా ప్రయత్నం


నా మనసులోని

భావాలను

మీతో సూటిగాచెప్పకుండా

తెలపాలని నా ప్రయత్నం


నేను అనుకున్నది

మీరూ తలచేలాచేసి

మీ పెదవులుకదిలించి

చెప్పించాలని నా ప్రయత్నం


నేను చూచినవి

మీ కళ్ళముందుపెట్టి

మీరూ చూచేటట్లు

చెయ్యాలని నా ప్రయత్నం


నేను విన్నవి

తియ్యగాచెప్పి

మీరూ వినేటట్లు

చేద్దామని నా ప్రయత్నం


నేను వ్రాసినవి

మీ చెంతకుచేర్చి

చదివించి

సంతోషపరచాలని నా ప్రయత్నం


నేను 

మీ నాలుకల్లో నానాలని

మీ తలల్లో తిష్టవేయాలని

నా ప్రయత్నం


నేను

మీ కళ్ళల్లో వెలగాలని

మీ చెవుల్లో దూరాలని

నా ప్రయత్నం


నేను

మీపై సౌరభాలుచల్లి

తన్మయత్వపరచాలని

నా ప్రయత్నం


నాతో మీరు 

సహకరిస్తారా

స్పందిస్తారా

సాహితీలోకంలోవిహరిస్తారా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం



Comments

Popular posts from this blog