ఏ ఎస్ రావునగర్ లో అద్భుతంగా జరిగిన బతుకమ్మ ఆట పాట మరియు సాహిత్య కార్యక్రమాలు
ధరణి మహిళ శక్తి, వినాయకనగర్ విశాలాక్ష్మి స్వయం సహాయక సేవాసంఘం మరియు కుసుమ ధర్మన్న కళాపీఠం వారి సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబరు ఏడవ తేదీన డాక్టర్ ఏ ఎస్ రావు నగర వాసుల సంక్షేమం మరియు సాంస్కృతిక సంఘంవారి గ్రంధాలయభవనంలో బతుకమ్మ సంబరాలు ఆద్యంతము ఆహ్లాద భరితంగా జరిగాయి. సభాధ్యక్షులు కవి, గాయకులు శ్రీ వాకిటి రాంరెడ్డి గారు అధ్యక్షప్రసంగంలో నిజమైన ప్రేమ మరియు ఆనందం అందరిమోముల్లో కనిపిస్తుందని శ్లాఘించారు మరియు తృప్తిని వ్యక్తపరిచారు.ప్రఖ్యాతకవి, రచయిత, అనువాదకుడు అయిన స్పెషల్ డిప్యూటి కలక్టర్ ముఖ్య అతిధి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు తెలంగాణా సంప్రదాయలు మరియు బత్కమ్మ వేడుకల ఆరంభానికి చారిత్రాత్మక కారణాలను వివరించి అందరి మన్ననలను పొందారు.కవి, పురావస్తు చరిత్రకారులు అయిన విశిష్ట అతిధి డాక్టర్ కావూరి శ్రీనివాస శర్మ గారు బతకమ్మ గురించి వివరిస్తూ సభికులను తమ శ్లోకాలతో ఆశీర్వదించి అందరిని ఆకట్టుకున్నారు. విశ్రాంత అటవీశాఖ అధికారి,ఆత్మీయ అతిధి శ్రీ అంబటి లింగాల క్రిష్ణారెడ్డి గారు తెలంగాణా ఆచారవ్యవహారాలకు నిదర్శనమైన బతుకమ్మను గురించి చక్కగా వివరించి తమ క్రిష్ణరాయబార పద్యాలతో మరియు మయసభ లోని దుర్యోధనుని దైలాగులతో వీక్షకులను ఉర్రూతలూగించారు. కవిసమ్మేళనంను డాక్టర్ రాధాకుసుమ గారు చెరగని చిరునవ్వుతో అద్భుతంగా నిర్వహించారు. 30 మంది కవులు పాల్గొని చక్కగా తమతమ కవితలను మధురంగా చదివి ఆకట్టుకున్నారు. ప్రత్యేక అతిధి శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ సమావేశ నిర్వహణకు దారి తీసిన పరిస్థితులను వివరించి సహకరించిన అతిధులకు, కవులకు మరియు మహిళామణులకు ధన్యవాదాలు చెప్పారు. సమన్వయ కర్త శ్రీ తులసి వెంకట రమణాచార్యులు కార్యక్రమాన్ని ఎంతో హుందాగ నిర్వహించారు. సమావేశానికి హాజరయిన మహిళలు బతుకమ్మ ఆటలు ఆడి అందరిని ముగ్ధులను చేశారు. సమావేశంలో పాల్గొన్న వారందరికి అతిధులు సన్మానించారు. ధరణి మహిళ శక్తి అధ్యక్షులు శ్రీమతి ధనమ్మ వెంకటరెడ్డి గారు అందరికి ధన్యవాదాలు చెప్పటంతో సమావేశం ముగిచింది. పాల్గొన్న సభికులందరు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా జరుగాలని కోరుకుంటున్నారు.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment