పొగుడుతుంటే


వీధుల్లో

ఏనుగునధిరోహించి

మేళతాళాలతో ఊరేగుతున్నట్లుంది


సభలో

మహానీయులచేతులతోటి

గండపెండేరం తొడిగించుకుంటున్నట్లుంది


ఆకాశంలో

నీలిమబ్బులపైకూర్చొని

విహరించుతున్నట్లున్నది


పడకగదిలో

పలురకాలపూలపానుపుపైన

పవళించుతున్నట్లున్నది


పున్నమివెన్నెలలో

మల్లెపూలతోటలో

ముచ్చటగా వాహ్యాళిచేస్తున్నట్లున్నది


అందాలలోకంలో

అద్భుతదృశ్యాలనుచూచి

ఆనందిస్తున్నట్లున్నది


నీలిగగనంలో

ఇంద్రధనస్సునెక్కి

సుందరమైన భూగోళాన్నిచూస్తున్నట్లుంది


పెద్దలసమక్షంలో

పెళ్ళిపీటపైనకూర్చొని

ఇష్టసఖిని వివాహమాడుతున్నట్లున్నది


ఎందుకో

నన్నుమునగచెట్టును

ఎక్కిస్తున్నారేమో అనిపిస్తుంది


గాఢనిద్రలో

మంచముపైపడుకొని

కలనుకంటున్నానేమోననిపిస్తుంది


దయచేసి పొగడ్తలతో

నన్ను ముంచకండి

వాస్తవాలలో జీవించనీయండి


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog