కవనకేళి 


కవిత్వంతో

క్రీడించాలనివున్నది

కుస్తీపట్టులు

కొనసాగించాలనివున్నది


అక్షరాలతో

ఆడాలనివున్నది

అందంగా

అల్లాలనివున్నది


పదాలతో

ఆటలాడించాలనివున్నది

పుటలపైన

కూర్చోబెట్టించాలనివున్నది


ఆలోచనలతో

ఆడుకోవాలనివున్నది

అంతరంగాలను

అంటుకోవాలనివున్నది


శబ్దాలతో

సయ్యాటలాడించాలనివున్నది

శ్రావ్యతను

చెవులకుకలిగించాలనివున్నది


సరిగమలతో

సందడిచేయాలనివున్నది

చిత్తాలను

చిత్తుచేయాలనివున్నది


పెదవులతో

తేనెచుక్కలుచల్లాలనివున్నది

నాలుకులకు

చప్పరించేలాచేయాలనివున్నది


అధరాలతో

అమృతంచిందాలనివున్నది

అందిపుచ్చుకొని

అమరంచెయ్యమనాలనివున్నది


కలంతో

కదంతొక్కించాలనివున్నది

కవనజగానికి

కాలిబాటనిర్మించాలనివున్నది


సుమాలతో

సుందరమార్గంచేయాలనివున్నది

సౌరభాలను

చుట్టూవెదజల్లాలనివున్నది


సాహితీజగతిలో

సంచరింపజేయాలనివున్నది

శారదాదేవిని

స్మరింపజేయాలనివున్నది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog