నా భావోద్వేగాలు
మొక్కలు పెంచుతా
పూలు పూయిస్తా
సౌరభాలు చల్లిస్తా
తేటులను పిలుస్తా
తేనెను త్రాగమంటా
పరవశము పొందమంటా
నోరు తెరుస్తా
పెదాలు కదిలిస్తా
శబ్దాలు వదులుతా
తేనెచుక్కలు చల్లుతా
అమృతము చిందిస్తా
ఆనందము అందిస్తా
ప్రభాకరుని ఉదయించమంటా
తట్టి నిద్రలేపుతా
అరుణకాంతులు ప్రసరిస్తా
అంధకారము తరిమేస్తా
పక్షులను కిలకిలలాడిస్తా
జగతిని చైతన్యపరుస్తా
చంద్రుని స్వాగతిస్తా
వెన్నెలను వెదజల్లమంటా
తారలమధ్య తిరగమంటా
మబ్బులతో దోబూచులాడమంటా
మెల్లగాచల్లగాలి తోలమంటా
మనసులను మురిపించుతా
ఆలోచనలు పారిస్తా
భావనలు పుట్టిస్తా
అక్షరాలను అల్లుతా
పదాలను పేర్చుతా
అర్ధాలను స్ఫురిస్తా
కమ్మనికైతలు కూరుస్తా
అందాలు చూడమంటా
ఆనందాలు పొందమంటా
హృదయాలను ఆకట్టుకుంటా
గుండెలకు గుసగుసలువినిపిస్తా
తలల్లో కాపురంపెడతా
సాహిత్యాన్ని సుసంపన్నంచేస్తా
భావం భ్రమాత్మకం
కవిత్వం కళాత్మకం
అందం ఆస్వాదాత్మకం
ఆనందం అనుభూతాత్మకం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment