గీతాలాపనలు


ప్రణయగీతం ఆలపించనా

ప్రబోధగీతం వినిపించనా

విప్లవగీతం ఆకర్ణించనా

విరహగీతం వీనులకందించనా                   ||ప్రణయ||


జోలపాటపాడి జోకొట్టనా

లాలిపాటపాడి లాలించనా

భక్తిగీతంపాడి  పరవశపరచనా

భావగీతంపాడి భ్రమింపజేయనా                  ||ప్రణయ|| 


అందాలగీతం పాడనా

ఆనందగీతం అందించనా

జానపదాలు వల్లెవేయనా

పౌరాణికాలు ప్రవచించనా                            ||ప్రణయ|| 


మనసుపాటలుపాడి ముచ్చటపరచనా

సొగసుపాటలుపాడి సంతృప్తిపరచనా

పెళ్ళిపాటలుపాడి ప్రోత్సాహపరచనా

పూలపాటలుపాడి పరిమళాలుచల్లనా           ||ప్రణయ|| 


తెలుగుపాటలుపాడి తృప్తినికలిగించనా

తేనెపాటలుపాడి తీపినిక్రోలుకోమందునా

పాతపాటలుపాడి పాతఙ్ఞాపకాలుతట్టనా

కొత్తపాటలుపాడి కొంగొత్తరుచులుచేర్చనా       ||ప్రణయ|| 



పిల్లలపాటలుపాడి ప్రమోదపరచనా

పెద్దలపాటలుపాడి సుద్దులుతెలపనా

హాస్యపాటలుపాడి నవ్వులుచిందించనా

శృంగారపాటలుపాడి వలపుకోర్కెలులేపనా     ||ప్రణయ|| 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog