తెలుసుకో


పడ్డవాళ్ళు అందరు

చెడ్డవాళ్ళుకాదని తెలుసుకో

మాటల ఈటెలు విసరటం 

ఏమాత్రము సబబుకాదని తెలుసుకో


బట్టను కాల్చి

పైన వేయకూడదని తెలుసుకో

పరులపై మకిలిని

చల్లి అంటించరాదని తెలుసుకో


పరులవిషయాల్లో జోక్యము

చేసుకోకూడదని తెలుసుకో

అనవసరంగా శతృత్వం 

తెచ్చుకోకూడదని తెలుసుకో


నీటిలా ధనమును

ఖర్చుబెట్టకూడదని తెలుసుకో

భవిష్యత్తులో అవసరాలకు

ఇబ్బందులు రావచ్చని తెలుసుకో


ఇచ్చిన మాటను

నిలుపుకోవాలని తెలుసుకో

అపనమ్మకస్థుడుగా ముద్రను

వేసుకోకూడదని తెలుసుకో


నోరు తెరిచేటప్పుడు

జాగ్రత్తగా ఉండాలని తెలుసుకో

జారిన మాటలను

వెనక్కు తీసుకోలేమని తెలుసుకో


గొప్పవాడినని గర్వించకు

పొగడ్తలకు పొంగిపోకూడదని తెలుసుకో

భట్రాజులను గుర్తించి

దూరంగా పెట్టటం తెలుసుకో


ఆలోచించి నిర్ణయాలు

తీసుకోవటం మంచిదని తెలుసుకో

తొందరపడి వ్యవహరించకు

లేకపోతే బురదలో కూరుకుపోవచ్చని తెలుసుకో


ఎదుటివారి తప్పులను ఎన్నటము

సరయిన పద్ధతికాదని తెలుసుకో

నువ్వు ఒప్పుగా మసలుకోవటము

అత్యంత ముఖ్యమని తెలుసుకో


సూచనలు ఇవ్వటము

తేలికయిన విషయమని తెలుసుకో

ఆచరణలో పెట్టటము

కష్టమైన వ్యవహారమని తెలుసుకో


వేమనలాగ హితాలు

నేను చెప్పటంలేదని తెలుసుకో

బద్దెనలాగ సూక్తులు

నేను బోధించటంలేదని తెలుసుకో


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

  1. మీ పోస్టులకు టైటిల్ పెట్టగలరు .. అప్పుడే శోధినిలో టైటిల్ వస్తుంది..

    https://www.sodhini.com/

    https://www.sodhini.com/result.php/?name=Gundlapall%20Rajendraprasad

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog