మూడు గంటలపాటు హాస్యం వండి వడ్డించిన కాలిఫోర్ణియా వీక్షణం వారి 148 వ అంతర్జాల సమావేశం
నేడు 14-12-2024 వ తేదీ జూమ్ లో జరిగిన 148 వ వీక్షణం సాహితీ సమావేశం హాస్యాన్ని వండి వడ్డించి సభికులను ఆనందసాగరంలో ముంచింది. ద్వాదశాబ్ది కాలం పైబడి నెల నెలా డా.గీతామాధావి గారు ప్రపంచ కవులకు సాహితీ విందు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా! అది వారి పట్టుదల, అకుంఠిత దీక్ష, సాహితీ ప్రియత్వం!! .ఆ విందులలో ఒక ప్రత్యేకత ఉంటుంది.ప్రతిసారి ఒక క్రొత్త వంటకాన్ని వండి వడ్డిస్తూ వుంటారు. దేనికదే గొప్ప రుచి. ఈసారి సాహితీవంకాయలో ఉల్లికారం కూరి వడ్డించిన హాశయుయ గుళిక గుత్తివంకాయ కూర అబ్బ! ఏమి రుచో!
గీతమ్మగారి స్వాగత వచనాలతో సభ ప్రారంభమైంది.నేటి ప్రత్యేక అతిధి హాస్యావధాని డా.శంకర నారాయణ గారి వైశిష్ట్యాన్ని , వారి వివిధ బిరుదులనూ,అవార్డులను గురించి గీతామాధవి గారు విపులీకరించారు.నోరు వెళ్ళబెట్టడం సభికుల వంతు అయింది ఇన్ని కిరీటాలు ఒక వ్యక్తికి సాధ్యమా అని.
డా.శంకర నారాయణ గారు తన ప్రసంగంలోని ప్రతి అక్షరము కూడా సభికుల కుక్షుల, బుగ్గల శక్తిని పరీక్షించింది సభికుల హర్షధ్వానాల నడుమ షుమారు 45 నిమిషములు సాగిన వారి ప్రసంగం అనితరం, అద్భుతం.
పిదప శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారు హాస్య కవిసమ్మేళనాన్ని ప్రారభించారు.
తొలిగా డా .గీతామాధవి గారు "వేయి వెలుగుల తెలుగు " అనే శీర్షికన మనతెలుగు ఎలా ఆంగ్లంతో కలగాపులగమై తన రూపం మార్చుకుందో సెటైరికల్ గా,హాస్యాన్ని విరబూస్తూ తమ కవితను చదివి నవ్వించారు.ఆమె కవితలుఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి.
సినీటీవీ గీతరచయిత శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు తన 'టీ ' అనే కవితలో అతిగా టీత్రాగడంవలన తన భార్యతో జగడాన్ని చదివి నవ్వించారు. శ్రీ కమర గారు కొడుకులు కాదు దొంగనా కొడుకులు అంటూ హాస్యాన్ని పండించారు డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావుగారు మిస్టర్ రోచ్ అనే కవితను చదివారు. శ్రీ కొత్తూరు వెంకట్ గారు రెండు ఆటవెలది పద్యరత్నాలను ఆలపించారు.
ప్రముఖ కవి శ్రీ బిల్లా శ్రీధర్ రెడ్దిగారు "అప్పు" అనే శీర్షికన అంత్యప్రాసా సౌందర్యాన్ని గుప్పిస్తూ అద్భుతమైన కవితతో నవ్వించారు. శ్రీ మోటూరి నారాయణరావు గారు ' శ్వాసకోశాల విలాసం' అనేకవితలో పొగత్రాగడంతో ఇబ్బందులను చమత్కారంగా చదివారు. డా.కోదాటి అరుణ గారు 'మరువలేనిబంధం' అనే కవితను వినిపించగా, శ్రీ అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు 'అనుభవం' అనే కవితలో జీవితంలో సర్దుకు పోవడం ఎంత అవసరమో తెలిపారు. శ్రీమతి పరాంకుశం కృష్ణవేణి గారు 'జీవితం' అనే కవితనూ, చిన్నాదేవిగారు 'ఎండమావులు' అనే కవితనూ చదివి సభికులను ఆకట్టుకున్నారు.
బుక్కాపట్నం రమాదేవి గారు ' అందమైన సుమమా' అంటూ భర్త తన భార్యతో సరసాన్ని సరసంగా వినిపించారు. శ్రీమతి అవధానం అమృతవల్లి గారు అత్త అల్లుడిని పండుగకు ఆహ్వానిస్తున్న చక్కని హాస్య జానపద గీతాన్ని శ్రావ్యంగా పాడి వీనులవిందు చేశారు. సుజాత కోకిల గారు 'ఇదేంటి ఈమాయ' అని భార్యా భర్తల నడుమ సంభాషణాన్ని చదివి నవ్వించారు.
శ్రీ మేడిశెట్టి యోగేశ్వరరావు గారు ' చక్కని చుక్కంట' అంటూ భార్యపైన హాస్య కవితను వినిపించారు. శ్రీ ప్రసాదరావు రామాయణం గారు భార్యాబాధితులకు తిరిగి మంచి కాలం వస్తుంది అంటూ అభయమిస్తూ' బాధా సర్ప ద్రష్టులు 'అనే కవితను చదివారు.
శ్రీ జె.వి కుమార్ గారు తన ' పనిమనిషి ' అనే కవితలో పనిమనిషితో జాగ్రత్త అంటూ హాస్యాన్ని చిందించారు.
శ్రీమతి చీదేళ్ల సీతాలక్ష్మిగారు ' తోలుతీస్తూ కప్పుకున్న ఛాయ ' అనే తన కవితలో నిజమైన మిత్రుడు తమ నీడేనంటూ చెప్పారు. శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు అప్పుచేయక ఎవరికీ తప్పదంటూ సరదా కవిత చదివారు.చివరిగా శ్రీ రాజేంద్రప్రసాద్ గారు 'కడుపు కాలుతూంది నకనక' అంటూ పకపక, చకచక, టకటక అని అద్భుతమైన అంత్యప్రాసలతో వినిపించిన కవిత సభకు ఓ హైలైట్. హాస్యం పీక్ కు చేరింది.!
ఉదయ్యం 6-30 కి ప్రారంభమైన సభ 9-30 పైగా జరిగి శ్రీమతి గీతా మాధవి గారి తుది పలుకులతో ముగిసింది.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment