నాతో పెట్టుకోకు
నోట్లో
మాటలున్నాయి
తేనెచుక్కలు చిందుతా
గ్రహించమంటా
చప్పరించమంటా
సంతసపరుస్తా
కోపంతెప్పిస్తే
తూటాలు ప్రేలుస్తా
గాయాలపాలు చేస్తా
చిందులు త్రొక్కిస్తా
రక్తం క్రక్కిస్తా
కంట్లో
కాంతులున్నాయి
ప్రసరిస్తా
కళకళలాడిస్తా
చూపులు సారిస్తా
ప్రేమలు కురిపిస్తా
కోపంతెప్పిస్తే
నిప్పురవ్వలు చల్లుతా
కాల్చిపారేస్తా
బూడిదగా మారుస్తా
చేతిలో
కలమున్నది
కమ్మనికైతలు కూరుస్తా
చక్కనిపాటలు పాడుతా
పసందైనపద్యాలు ఆలపిస్తా
ఆగ్రహంతెప్పిస్తే
కలాన్ని కత్తిగామారుస్తా
దాడిచేస్తా
దొమ్మీకొస్తా
తంటాలుపెడతా
మదిలో
ఆలోచనలున్నాయి
అనుభూతులు పొందుతా
అక్షరాలు పారిస్తా
పదాలు పేరుస్తా
అందాలు చూపుతా
ఆనందంకలిగిస్తా
క్రోధానికిగురిచేస్తే
విప్లవగీతాలు రాస్తా
కాగడాలు పట్టిస్తా
తిరుగుబాటు చేయిస్తా
సమాజానికి ఎదురుతిరుగుతా
సంఘసంస్కరణలు చేబడతా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment