నీవులేక నేనులేను......
చెట్టెండిపోయినా పరవాలేదు
బావినీరింకినా ఇబ్బందిలేదు
వెన్నెలలేనిరాత్రయినా సమస్యలేదు
జేబుఖాళీయయినా చింతలేదు
పంచభక్ష్యాలు అవసరములేదు
నవరసాలు కోరుకునేదిలేదు
షడ్రుచులు కావాలనుకోను
పసందయినవంటలు వడ్డించాలనుకోను
కష్టాలైనా పడగలను
నష్టాలైనా భరించగలను
పస్తులైనా ఉండగలను
ఆస్తులైనా అమ్మగలను
గౌరవమర్యాదలు ఇవ్వాలనను
పేరుప్రఖ్యాతులు ఆశించను
మంచీచెడ్డలను పట్టించుకోను
ఆయురారోగ్యాలకు పరితపించను
నీ తాళిని తెంపించలేను
నీ బొట్టును చెరిపించలేను
నీ గాజులు పగులగొట్టించలేను
నీ సౌభాగ్యము దూరంచేయలేను
నీ సాహచర్యం వదులుకోలేను
నీ తోడులేక బ్రతుకలేను
నీ ప్రేమాభిమానాలులేక మనుగడసాగించలేను
నీవులేని జీవితాన్ని గడపలేను
చెంతనే ఉండు సంతోషంగా గడుపుదాం
చేతులు కలుపు కలసిముందుకు నడుద్దాం
అందాలను చూపు ఆనందంగా జీవించుదాం
నవ్వులు చిందించు నవలోకంలో విహరించుదాం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment