మా ఆవిడ షరతులు


రుచిగావున్నా

లేకపోయినా

పేరుపెట్టకుండా

అన్నంతినాలంటుంది మా ఆవిడ


అలంకరించుకున్నా

లేకపోయినా

అందంగాకనపడమనకుండా

సర్దుకుపోవాలంటుంది మా ఆవిడ


ఒకటోతేదీలోపలే

జీతాన్నంతా

నగుదురూపేణా

చేతికివ్వాలంటుంది మా ఆవిడ


గదిమినా

తిట్టినా

ఎదురుతిరగకుండా

నోరెత్తకూడదంటుంది మా ఆవిడ


నచ్చినా

నచ్చకపోయినా

నలుగురిముందు

మెచ్చాలంటుంది మా ఆవిడ


ఎప్పుడూ

డబ్బులలెక్కలను

పొరపాటునైనా

అడగొద్దంటుంది మా ఆవిడ


కార్యాలయమునుండి

అటూనిటూతిరగకుండా

నేరుగా

ఇంటికిరావాలంటుంది మా ఆవిడ


ఆదేశాలు 

అమలుచేయకపోతే

పస్తులు

పెడతానంటుంది మా ఆవిడ


కోపంతెప్పిస్తే

నగలునట్రాతీసుకొని

పెట్టాబేడాసర్దుకొని

పుట్టింటికెళతానంటుంది మా ఆవిడ


ఏమిచెయ్యాలో

తోచటంలా

ఎలాచెప్పాలో

అర్ధంకావటంలా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog