కవితాజననాలు


తట్టిందే తడవుగా

కాగితాలకెక్కిస్తే

కవితలవుతాయి

నెలతక్కువ శిశువులు


ఆలోచనలు పారించి

మెరుగుపరచివ్రాస్తే

కవితలవుతాయి

ఆరోగ్యవంతమయిన బిడ్డలు


నాలుగుసార్లు పరిశీలించి

దోషాలుతొలిగించి నాణ్యంగావ్రాస్తే

కవితలవుతాయి

ముచ్చటయిన ముద్దులపాపాయిలు


చక్కగా కూర్చి

శ్రావ్యంగాపాడితే

కవితలవుతాయి

నిద్రపుచ్చే పిల్లలజోలపాటలు


సందర్భాన్నిపట్టి

సమయోచితంగావ్రాస్తే

కవితలవుతాయి

చిన్నారుల జన్మదినవేడుకలు


తెల్లవారి వెలుగులో

ఉషోదయకాలానవ్రాస్తే

కవితలవుతాయి

నవ్వులుచిందుతున్న బాలలబుగ్గలు


పున్నమి రోజున

వెన్నెలలో విహరిస్తూవ్రాస్తే

కవితలవుతాయి

చంటిపాపల చంద్రవదనాలు


మొగ్గతొడిగి విప్పారినపుడు

పరిమళాలుపీలుస్తూవ్రాస్తే

కవితలవుతాయి

ఆడుకుంటున్న అందాలబుడతలు


ముత్యాల్లంటి అక్షరాలతో

పగడాల్లాంటి పదాలతోపేరిస్తే 

కవితలవుతాయి

నవరత్నాల్లాంటి నవజాతపసికూనలు


అనుకున్నట్లులేదని ఆపివేస్తే

అనుకూలించలేదని అణచివేసుకుంటే

కవితలవుతాయి

భ్రూణహత్యలు గర్భస్రావాలు


కలిసొచ్చే కాలమొస్తే

నడిచొచ్చే పిల్లలుపుడతారన్నట్లు

అదృష్టము వరించితే

ఆవిష్కృతమవుతాయి అద్బుతకైతలు 


గుండపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog