ఓ వసంతమా!


చెట్లు

ఆకులు రాలుస్తున్నాయి

నీవు వస్తావని

చిగురులు వేయిస్తావని

శోభాయమానం చేస్తావని 


కోకిలలు

ఎదురుచూస్తున్నాయి

నీవు వస్తావని

మావిచిగుర్లు తినిపిస్తావని

కంఠాన్ని విప్పిస్తావని


వేపవృక్షాలు

ప్రతిక్షిస్తున్నాయి

నీవు వస్తావని

పూత పూయిస్తావని

ఉగాదిపచ్చడి చేయిస్తావని


మామిడితరువులు

కాచుకొనియున్నాయి

నీవు వస్తావని

తోరణాలు కట్టిస్తావని 

పిందెలు కాయిస్తావని


మొక్కలు

పొంచియున్నాయి

నీవు వస్తావని

పూలుపూయిస్తావని

పొంకాలు చూపించవచ్చని


మల్లెలు

వీక్షిస్తున్నాయి

నీవు వస్తావని

విరులు వికసింపజేస్తావని

పరిమళాలు చల్లిస్తావని


ప్రకృతి

వేచిచూస్తున్నది

నీవు వస్తావని

పచ్చదనం పరుస్తావని

పుడమికి చక్కదనాన్నిస్తావని


తెలుగోళ్ళు

తొందరపడుతున్నారు

నీవు వస్తావని

ఉగాదిపండుగ తెస్తావని

కొత్తసాలులో కోర్కెలనుతీరుస్తావని


పిల్లలు 

కనిపెట్టుకొనియున్నారు

నీవు వస్తావని

వసంతపంచమి తెస్తావని

అక్షరాభ్యాసం చేయిస్తావని


ప్రజలు

ప్రతిక్షిస్తున్నారు

నీవు వస్తావని

చలికాలం పోతుందని

సంతసాలను కలిగిస్తావని


కవులు

నిరీక్షిస్తున్నారు

నీవు వస్తావని

అందాలు చూపుతావని

కమ్మనికవితలు రాయిస్తావని


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog