నా చిరునామా.....


నన్ను కనుక్కోవటము

చాలా సులభము

నన్ను వెతకడము

అతి సరళము


నన్ను తెలుసుకోవటము

కడు సుసాధ్యము

నన్ను గుర్తించటము

బహు సునాయాసము


ఎక్కడ అందముందో

అక్కడ నేనుంటా

ఎచోట ఆనందముందో

ఆచోట నేనగుపడుతుంటా


ఎచ్చోట సుభిక్షముందో

అచ్చోట నేకాపురముంటా

ఎందు సౌరభాలువీస్తున్నాయో

అందు నేతిరుగుతుంటా


ఏకాడ మాధుర్యమున్నదో

ఆకాడ నేతిష్టవేసియుంటా

ఏప్రాంతాన నవ్వులున్నాయో

ఆప్రాంతాన నేనివాసముంటా


ఎందెందు మంచితనమున్నదో

అందందు నేనడయాడుతుంటా

యత్ర మహిళలుబాగున్నారో

తత్ర నేబోధనలుచేస్తుంటా


ఎగ్గడ శాంతిసౌఖ్యాలుంటాయో

అగ్గడ నేపర్యవేక్షిస్తుంటా

ఏస్థానాన తెలుగుందో

ఆస్థానాన నేవెలుగుతుంటా


ఏడ కవులుసత్కరింపబడుతున్నారో

ఆడ నేనుండిప్రోత్సహిస్తుంటా 

ఎయ్యెడ సాహిత్యమువర్ధిల్లుతుందో

అయ్యెడ నేజీవనంసాగిస్తుంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog