ఓ పాఠకుడా!
నూతన అధ్యాయం మొదలెడుతున్నా
కొత్త పుంతలు తొక్కుతున్నా
నవ నవోన్మేషానికి అడుగులేస్తున్నా
నీవెనుక నేనున్నానని గుర్తించుకో పాఠకా!
కాలంలా వేగంగా పరుగెత్తుతూ
నదిలా ముందుకు ప్రవహిస్తూ
తూఫాను హోరుగాలిలా వీస్తూ
నీవెంట నేనున్నానని ఙ్ఞాపకముంచుకో పాఠకా!
రవిలా కిరణాలు వెదజల్లుతూ
శశిలా వెన్నెలను కురిపిస్తూ
తారకల్లా తళతళా మెరుస్తూ
నీవెంట నేనున్నానని తలచుకో పాఠకా!
చెరకు రసంలా తియ్యగా
పువ్వుల తేనెలా మధురంగా
తేట తెలుగులా రమ్యంగా
నీవెంట నేనున్నానని ఎరుగు పాఠకా!
మల్లెపూల సుగంధంలా
మొగలిరేకుల సువాసనలా
మరువపత్రాల సౌరభంలా
నీవెంట నేనున్నానని గమనించు పాఠకా!
గళమెత్తిన కోకిల కంఠంలా
పురివిప్పిన నెమలి నాట్యంలా
ఎగురుతున్న సీతాకోకచిలుకల్లా
నీవెంట నేనున్నానని కనుగొను పాఠకా!
సంసారసాగరం ఈదుతూ
జీవనపయనం సాగిస్తూ
పగటికలలను కంటూ
నీవెంట నేనున్నానని నెమరువేసుకో పాఠకా!
నిన్ను ఆనందడోలికలలో ముంచాలని
నీ మదిని దోచుకోవాలని
నన్ను కలకాలంగుర్తించేలా చేయాలని
నీకోసం నేనెప్పుడు కాచుకొనియుంటానని స్మరించుకో పాఠకా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment