కవిత కమ్మదనానికి
కవితకు
కాశ్మీరాంబరం కప్పాలని ఉన్నది
కవితాకన్యమెడకు
మందారమాలను వెయ్యాలని ఉన్నది
కవితాసుమానికి
మొగిలిపూపరిమళం అద్దాలని ఉన్నది
కైతమ్మనోరుకు
తేనెను రాయాలని ఉన్నది
కయితాబాలపెదాలకు
అమృతం అందించాలని ఉన్నది
కవితాగానశ్రోతలకు
వెన్నెలమత్తు ఎక్కించాలని ఉన్నది
కవనభావాలను
రసాత్మకం చేయాలని ఉన్నది
కవితావిషయాలను
కళాత్మకం చేయాలని ఉన్నది
కవితాచెలియను
పకపకా నవ్వించాలని ఉన్నది
అక్షరకూర్పులను
కవితాత్మకం చేయాలని ఉన్నది
కయితాపాఠకులపై
రవికిరణాలను ప్రసరించాలని ఉన్నది
కవితాప్రియులను
కుతూహల పరచాలని ఉన్నది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment