నాతో వస్తారా!


తోచింది చెబుతా

తియ్యంగ వినిపిస్తా

చెవులదుమ్ము దులుపుతా

చక్కగవినటము నేర్పుతా


అందాలు చూపిస్తా

ఆనందం కలిగిస్తా

కంటితెరలు తొలగిస్తా

ముచ్చటగచూడటం నేర్పుతా


వెలుగులు చిమ్ముతా

బాటలు చూపిస్తా

ముందుకు నడిపిస్తా

జీవితాన్ని బంగారుమయంచేస్తా


ఆలోచనలు పారిస్తా

అంతరంగాన్ని తడుతా

ఆశయాలు ఏర్పరుస్తా

అఙ్ఞానాన్ని పారదోలుతా


భ్రమలు కల్పిస్తా

గాలిలో ఎగిరిస్తా

ఆకాశపు అంచులుకుతీసుకెళ్తా

భావనలలో ముంచేస్తా


నిత్యం చదివిస్తా

కొత్తవిషయాలు నేర్పిస్తా

హితవచనాలు వల్లెవేయిస్తా

భవితకు బాటలునిర్మింపజేస్తా


వెన్నెలను కురిపిస్తా

వయ్యారాలు కనమంటా

వినోదపరుస్తా

విహరింపజేస్తా


పూదోటలోనికి తీసుకెళ్తా

పొంకాలు పరికించమంటా

పరిమళాలు పీల్చమంటా

పరమానందము పొందమంటా


నాతో వస్తారా

చేతులు కలుపుతారా

కలసి అడుగులువేస్తారా

కమ్మగాకాలం గడుపుతారా


నాతో వస్తారా

నన్ను మెచ్చుకుంటారా

నాకవితలు చదువుతారా

నన్ను గుర్తించుకుంటారా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 


Comments

Popular posts from this blog