నా మాటలవర్షంలో తడుస్తారా కవితలకాలువలో పయనిస్తారా!


మీరు

నా మాటల్ని 

వింటారనుకుంటున్నాను

సందర్భం ఎరిగి

సమయం తెలుసుకొని ఆస్వాదిస్తారనుకుంటున్నాను


నా మాటల్ని

విశ్వసిస్తారనుకుంటున్నాను

కట్టుకధలు కావని

కనికట్టులు కాదని అభిప్రాయపడతారనుకుంటున్నాను


నా మాటల్ని

చదువుతారనుకుంటున్నాను

చక్కగా అమరాయని

తియ్యగా ఉన్నాయని తలంచుతారనుకుంటున్నాను


నా మాటల్ని

గురుతుపెట్టుకుంటారనుకుంటున్నాను

నోటిలో నానుస్తూ

తలలో దాచుకుంటూ మెలుగుతారనుకుంటున్నాను


నా మాటల్ని

పట్టించుకుంటారనుకుంటున్నాను

అంతరార్ధాలు ఎరిగి

విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తారనుకుంటున్నాను


నా మాటల్ని

ప్రాచుర్యంలోకి తెస్తారనుకుంటున్నాను

సామెతల్లా వాడి

సందేశాల్లా భావించి ప్రశంసిస్తారనుకుంటున్నాను


నా మాటలశక్తితో

మిమ్మల్ని కట్టిపడవేయాలనుకుంటున్నాను

నా మాటలకౌశలంతో

మిమ్మల్ని మురిపించాలనుకుంటున్నాను


నా అక్షరాలకూర్పుతో

మిమ్మల్ని అలరించాలనుకుంటున్నాను

నా పదాలప్రయోగంతో

మిమ్మల్ని పారవశ్యపరచాలనుకుంటున్నాను


నా మాటలతో

అంగీకరిస్తారా

నా రాతలతో

ఆనందిస్తారా


నా మాటలవర్షంలో

తడుస్తారా

నా కవితలకాలువలో

పయనిస్తారా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog