తేనీటి తేటకవిత
తేనీరు
వేడిగ త్రాగుతుంటే
ఊహలు
ఉల్లాన ఉరుకులెత్తుతాయి
తేనీరు
పొగలు క్రక్కుతుంటే
కలము
కైతలు కారుస్తుంది
తేనీరు
గటగటా సేవిస్తుంటే
పేపరు
చకచకా నింపమంటుంది
తేనీరు
రుచిని చూపుతుంటే
గళము
గొంతెత్తి రాగంతీస్తుంది
తేనీరు
మదిని ఉబికిస్తుంటే
తేటతెలుగు
హృదిని తట్టిలేపుతుంది
తేనీరు
సువాసన వెదజల్లుతుంటే
కవిత్వము
సౌరభాలను చిమ్ముతుంది
తేనీరు
చెంతకు పిలుస్తుంటే
నిద్రమత్తు
త్రాగి వదిలించుకోమంటుంది
తేనీరు
కవితను వ్రాస్తా
తెలుగు
తీపిని అందిస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment