ఆర్చుతావా! తీర్చుతావా!
నీ అందెలరవళులు
వినాలని ఉన్నది
అంతరంగంలోని అలజడులు
ఆర్చుకోవాలని ఉన్నది
నీ గాజులగలగలలు
వినాలని ఉన్నది
గుండెలోని గుబులును
తీర్చుకోవాలని ఉన్నది
నీ పకపకనవ్వులు
వినాలని ఉన్నది
పరిహాసాలలోకి దిగి
పరవశించాలని ఉన్నది
నీ సరిగమపదనిసలు
వినాలని ఉన్నది
సవరించి గొంతుకను
కలపాలనిఉన్నది
నీ పాదాలచప్పుళ్ళు
వినాలని ఉన్నది
పురివిప్పిన నెమలితో
పోల్చుకోవాలని ఉన్నది
నీ తీయనిపలుకులు
వినాలని ఉన్నది
సరస సల్లాపాలలో
దిగాలని ఉన్నది
నీ అందచందాలను
చూడాలని ఉన్నది
నీ పేమాభిమానములు
పొందాలని ఉన్నది
నీవు రగిల్చిన అగ్నిని
ఆర్చుకోవాలని ఉన్నది
నీవు లేపిన కోర్కెలు
తీర్చుకోవాలని ఉన్నది
ఓ ప్రియా!
చెంతకువస్తావా
చేతులుకలుపుతావా
చింతనుతొలగిస్తావా
ఓ చెలీ!
ఆర్చుతావా
తీర్చుతావా
కూర్చుతావా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం

Comments
Post a Comment