కవనప్రియులారా!
క్షణాలను వెచ్చిస్తా
నిమిషాలను వాడేస్తా
గంటలు గడిపేస్తా
దినాలు దొర్లిస్తా
నెలలు నెట్టేస్తా
కాలచక్రం తిప్పేస్తా
కైతలు కూర్చేస్తా
ఊహలు ఊరిస్తా
తలను నింపేస్తా
ఆలోచనలు పారిస్తా
విషయాలు తేలుస్తా
భావాలు లేపుతా
భ్రమలలో ముంచుతా
కవితలను రాసేస్తా
అక్షరాలను విసురుతా
గాలిలో చల్లుతా
మట్టిపై పరుస్తా
పుట్టలు పుట్టలుగా
తుట్టెలు తుట్టెలుగా
గుట్టలు గుట్టలుగా
కవనాలు అల్లేస్తా
పువ్వులు తెస్తా
తలలపై చల్లుతా
అంజలులు ఘటిస్తా
దండలు గుచ్చుతా
మెడలలో వేస్తా
పరవశం కలిగిస్తా
కయితలు పారిస్తా
తేనెచుక్కలు చల్లుతా
తీయదనం పంచుతా
పరిమళాలు వెదజల్లుతా
అందాలు చూపుతా
ఆనందాలు చేకూరుస్తా
ఆకాశంలో విహరింపజేస్తా
కవిత్వాలను సృష్టిస్తా
కవితలను
చూడండి
చదవండి
పాడండి
వినండి
ఆస్వాదించండి
గుర్తుంచుకోండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment