కవితాత్మకం


అడుగులేస్తేకదా

ముందుకు కదిలేది

పయనం సాగేది


పెదవివిప్పితేకదా

మాటలు బయటకొచ్చేది

మనసును తెలియపరచేది


వెదికితేకదా

అక్షరాలు దొరికేది

అల్లిక అర్ధవంతమయ్యేది


పాటుబడితే

పదాలు పొసిగేది

ప్రాసలు కుదిరేది


ఆలోచిస్తేకదా

విషయము తట్టేది

భావం బయటకొచ్చేది


కలంపడితేకదా

కాగితాలు నిండేది

కవిత్వం పుట్టేది


చదివితేకా

కవితలు అర్ధమయ్యేది

కమ్మదనం పొందగలిగేది


వింటేకదా

శ్రావ్యత తెలిసేది

గానామృతం క్రోలేది 


ఆస్వాదిస్తేకదా

అనుభూతి కలిగేది

ఆనందం దొరికేది


బాగుంటేకదా

కవితకు పేరొచ్చేది

కవి చరిత్రపుటలకెక్కేది


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం  


Comments

Popular posts from this blog