నా బాటలు - నా మాటలు
అందాలప్రదేశాలను
చూద్దామని
ఆనందాలబాటను
పడుతున్నా
ఉన్నతశిఖరాలను
చేరాలని
కొండదారిని
ఎక్కుతున్నా
ఆకాశపు అంచులను
తాకాలని
మబ్బులమార్గమును
ఆశ్రయిస్తున్నా
సుఖమైన జీవితాన్ని
అందుకోవాలని
పూలపథమున
పయనిస్తున్నా
లోతైన విషయాలను
వెల్లడించాలని
భావకైతలతెరువును
ప్రయత్నిస్తున్నా
ప్రణయలోకమందు
విహరించాలని
ప్రేమత్రోవన
ప్రయాణంచేస్తున్నా
ఊహలపల్లకిని
ఎక్కాలని
కల్పనానిగమమున
పర్యటిస్తున్నా
కాసులమూటలను
కట్టుకోవాలని
బంగారుగతిన
సాగుతున్నా
అంతరంగమును
అలరించాలని
సుగంధాలనడవన
నడుస్తున్నా
పుణ్యపురుషుడిని
కావాలని
భక్తి తొవ్వన
కాలుమోపుతున్నా
కవితాపంటలను
పండించాలని
కవనసేద్యదోవన
కదులుతున్నా
తేనెపలుకులను
చల్లాలని
తేటతెలుగుజాడను
ఎంచుకున్నా
ప్రియమైన పాఠకులను
పరవశపరచాలని
సాహితీసరణిని
చేబడుతున్నా
సరస్వతీమాతను
సంతసపరచాలని
అక్షరాలరస్తాన
అడుగులేస్తున్నా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment